వివాహం,అధికారం,మీడియా...లక్ష్మి పార్వతి

వివాహం,అధికారం,మీడియా...లక్ష్మి పార్వతి

08-11-2019 05:09 PM Siva Racharla

గ్రామీణ  రైతు కుటుంబ నేపధ్యం నుండి ఈ పురషాధిక్య ప్రపంచంలో కష్ట నష్టాలను దాటుకొని ఎన్నో అపనిందలు భరించి...ఒక ఉన్నత విద్యావంతురాలిగా,అధ్యాపకురాలిగా,భాష పండితురాలిగా,రచయిత్రిగా తనని తాను మలచుకొని తన ప్రతిభా పాటవాలతో జీవితంలో అంచెలంచలుగా ఒక్కొక్క మెట్టు పైకెదిగి మీడియా దుష్ప్రచారానికి బలి కాబడ్డ నిస్సహాయ స్థితిలో కూడా  పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడిన లక్ష్మి పార్వతి ఒక జయలలిత లేక మమతా కాకపోవొచ్చు కానీ ఆంధ్ర రాజకీయ చరిత్రలో తనకొక పేజీ లిఖించుకున్నారు. .

చంద్రబాబు మలి (అంటే ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి) చరిత్రకు లక్ష్మిపార్వతిని మించిన సాక్షి ఎవరుంటారు?చంద్రబాబు ముఖ్యమంత్రి కాకుండాఉంటే  చరిత్రలో ఆయన ఎన్టీఆర్ అల్లుడుగానే మిగిలిపోయేవాడు.   

విజేతలదే చరిత్ర కానీ చరిత్రంతా విజేతలేదే కాదు.చివరి వరుసలోనే,ఒక మూలనో కూర్చొని ఆచరిత్రలోని నల్లమరకలను ఎత్తిచూపే  బాధితులు,సాక్షులు ఉంటారు. ప్రత్యర్థిని దెబ్బకొట్టే శక్తి తనకు లేనప్పుడు బలవంతులెవరైనా వస్తారా?తన చేతిలోని ఆయుధం అది చిన్న రాయి అయినా సరే ఆ బలవంతుడికి ఇద్దాం అని ఎదురు చూస్తారు. గత 2 దశాబ్దాల చరిత్ర లక్ష్మిపార్వతి  సరిగ్గా ఇదే పని చేశారు. 

2004లో కాంగ్రెస్ గెలిచినప్పుడు తానే గెలిచినంతగా లక్ష్మి పార్వతి సంబరపడ్డారు.ఆ ఎన్నికల్లో కర్నూల్ జిల్లా ఆత్మకూర్ నుంచి పోటీ చేసి పట్టుమని రెండు వేల ఓట్లు సాధించలేక పోయినా చంద్రబాబు ఓటమే తన గెలుపు అన్నారు. 

ఇదిగో ఇప్పుడు జగన్ లక్ష్మి పార్వతిని తెలుగు అకాడెమీ చైర్ పర్సనుగా నియమించటంతో తొలిసారి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యింది. ఆవిడ సాహిత్య వివరాలు చూడండి

https://telugu.idreampost.com/news/political/laxmiparvati-telugu-academy

ఎన్టీఆర్ లక్ష్మి 


యుద్ధం ముగింపు కాదు,చరిత్ర పరంపరలో యుద్ధం కేవలం ఒక సంఘటన. యుద్ధంలో గెలిచినవాడు విజేత కావొచ్చు,హీరోగా కీర్తించబడొచ్చు కానీ అది మరో యుద్ధం జరిగేంత వరకు మాత్రమే!కొత్త  యుద్ధంలో హీరో,విలన్లు మారొచ్చు...రాజకీయ చరిత్రలో శాశ్వత విజేతలు లేరు,పరాజితులు లేరు... Wait for your turn . 
విలన్లు లేని చరిత్రలో హీరోలు కూడా ఉండరు...కొందరిని హీరోలను చెయ్యటం కోసం విలన్లను సృష్టించటం ఈ మీడియా యుగంలో సర్వసాధారణం. వైశ్రాయ్ వేదికగా రచించబడ్డ చరిత్రలో హీరో ఎవరు?విలన్ ఎవరు?

ఎన్టీఆర్ ఎన్నోసార్లు తనను చూసుకునే వారులేరు,తనకు తోడు అవసరం అందుకే లక్ష్మి పార్వతిని వివాహం చేసుకున్నాను అని చెప్పారు. మొదటి భర్తను వొదిలి ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకోవటం నైతికం కాదని , ముసలి వయసులో ఎన్టీఆర్ కు తోడు ఎందుకు అని సనాతులే కాదు ఆధునికులు ఇప్పటికి వాదిస్తుంటారు. 

లక్ష్మి పార్వతి దుష్ట శక్తి  ,ఏమి చేసింది?పాలనలో కలగచేసుకుంటుంది,ఇంకా ?పట్టుచీరలు,నగలు లంచాలు తీసుకుంటుంది.పార్టీలో కోటి మందిని సభ్యులుగా చేర్చారని(అది కూడా మిస్ కాల్ ఇస్తే ఇచ్చే సభ్యత్వం)  కొడుకుని పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ని చేసి ఆపైన మంత్రిని చేసిన చంద్రబాబు 1995లో లక్ష్మి పార్వతి మీద చేసిన ఆరోపణలు ఇప్పుడు తలుచుకుంటే హాస్యాస్పదంగా ఉండవా?

ఎన్టీఆర్ కన్నా టీడీపీ పార్టీనే ముఖ్యం,అందుకే ఎన్టీఆర్ ను దించాము..టీడీపీ ఎన్టీఆర్ ది కాకుండ చంద్రబాబుది ఎలా అయ్యిందో ప్రజలకు ఎప్పటికి అర్ధంకాని విషయం. టీడీపీ పోటీచేసిన తోలి ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీచేసిన చంద్రబాబు కు తన మామ,తనకు టీడీపీలో స్థానం కల్పించిన ఎన్టీఆర్ కన్నా టీడీపీ ఎలా ముఖ్యమయ్యింది?టీడీపీ ఎవరి మానస పుత్రిక?చంద్రబాబుకు పార్టీ కాదు ముఖ్యమంత్రి పదవే ముఖ్యమని రాయటానికి ఆనాడు పత్రికలకు మనసు రాలేదు. 

మీడియా దన్నుతోనే చంద్రబాబు ఎదిగింది,రాజకీయంగా బతికి బట్టకట్టింది.మీడియా కుట్రతోనే లక్ష్మిపార్వతి రాజకీయంగా దెబ్బతిన్నది. ఎన్టీఆర్ మరణం తరువాత లక్ష్మి పార్వతి 2 ఎన్నికలను గట్టిగానే ఎదుర్కొన్నది. ఎన్టీఆర్ మరణించిన నెలలోపే లక్ష్మి పార్వతి వర్గం 15-Feb-1996 న విజయవాడలో "సింహగర్జన" పేరోతో పెద్ద సభ జరిపారు.ఆసభకు కనీసం రెండు లక్షల మంది ప్రజలు హాజరయ్యారు.దగ్గుబాటి వెంకటేశ్వర రావ్ చొరవతో నేషనల్ ఫ్రంట్ నాయకులు శరద్ యాదవ్ ,రామ్ విలాస్ పాశ్వాన్,మధు దండావతే,మురుసోలీ మారన్,దినేష్ గోస్వామి ... ఎందరో ఆసభకు హాజరయ్యారు. ఆ సభ చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టించింది,ప్రజల్లో లక్ష్మి పార్వతి మీద సానుభూతి ఉందన్న భయం చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేసింది. 

ఎన్టీఆర్ టీడీపీ (LP)

సింహ గర్జన జరిగిన 10 రోజుల్లోనే ఆరు రాజ్య సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. చంద్రబాబు వర్గానికి 5 స్థానాలు గెలవటానికి సరిపడా బలంఉంది. సరిపడా బలం లేకపోయినా కాంగ్రెస్ తరుపున  డక్కన్ క్రోనికల్ వెంకట్ రామిరెడ్డి,లక్ష్మి పార్వతి వర్గం నుంచి దగ్గుబాటి పోటీచేశారు. చంద్రబాబు క్యాంపు రాజకీయాలు చేసినా ఆయన వర్గం నుంచి దగ్గుబాటి,కాంగ్రెస్ వెంకట్ రామిరెడ్డికి క్రాస్ వోటింగ్ జరిగింది. ఆ ఎన్నికల్లో దగ్గుబాటి గెలిచారు... 

ఇది జరిగిన రెండు నెలలకి 1996 ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలొచ్చాయి.లక్ష్మి పార్వతి మీద ప్రజల్లో సానుభూతి ఉంది,తనఎమ్మెలేలు కూడా నిబద్దతతో లోక్ సభ అభ్యర్థుల గెలుపుకు కష్టపడరెమోనన్న అనుమానంతో చంద్రబాబు మంత్రులను,బలమైన ఎమ్మెల్యేలను లోక్ సభ బరిలోకి దించారు.టీడీపీ తరుపున మంత్రులుగా ఉన్న ఎర్రం నాయుడు, అయ్యన్నపాత్రుడు,కొత్తపల్లి సుబ్బారాయుడు, రామకష్ణా రెడ్డి,S.V.సుబ్బారెడ్డి,మండవ వెంకటేశ్వర రావ్,సుద్దాల దేవయ్య, L.రమణ ,వేణుగోపాలాచారి,చందులాల్ పోటికి దిగారు.

వీరితోపాటు టీడీపీ  తరుపున ఈ ఎన్నికలలోనే మొదటిసారి కైకాల సత్యనారాయణ, శారద పొటిచేశారు. బాలయోగి,వడ్డే శోభానాధీశ్వర రావ్, D.K.అరుణ  కందుల రాజమోహన్ రెడ్డి,మేకపాటి రాజమోహన్ రెడ్డి, భూమా నాగిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు,లాల్ జాన్ బాష,తీగల కృష్ణారెడ్డి లాంటి ప్రముఖులు పోటిచేశారు.

లక్ష్మిపార్వతి వర్గం తరుపున శ్రీకాకుళం నుంచి పోటిచేసిన NTR పెద్ద కొడుకు జయకృష్ణకు  అందరికన్నా ఎక్కువగా దాదాపు 2 లక్షల వోట్లు వచ్చాయి.విజయవాడ నుంచి పోటిచేసిన దేవినేని నెహ్రుకు 1.70 లక్షల వోట్లు,అమలాపురం నుంచి పొటిచేసిన బాబు మోహన్ కు 1.43 లక్షల ఓట్లు వచ్చాయి,బాబు మోహన్ ఎక్కువ వోట్లు చీల్చటం వలన బాలయోగి ఓడిపోయి కాంగ్రేస్ గెలిచింది.లక్ష్మిపార్వతి వర్గం తరుపున పోటీచేసినవారిలో 12 మందికి లక్షకు పైగా వోట్లు వచ్చాయి. 

లోక్ సభకు ఎన్నికయిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామాతో ఖాళీ అయినా స్థానాలకు అక్టోబర్లో ఉప ఎన్నికలు జరిగాయి.ఈ ఉప్పఎన్నికలతో చంద్రబాబు పోల్ మానేజ్మెంట్ కు కొత్త అర్ధాన్ని నిర్వచించారు. తొలిసారి ఆంద్ర ఓటర్లు 500 రూపాయల నోటు చూసింది కూడా ఈ ఎన్నికలతోనే. 1989లో ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ కృష్ణుడి ఫోటోలు వాడారన్న కేసులో పాతపట్నం టీడీపీ మ్మెల్యే కలమట మోహన్ రావ్ ను 1996లో కోర్టు disqualify చేసింది. దీనితో అక్కడ ఉపఎన్నిక జరిగింది. పాతపట్నం నుంచి లక్ష్మి పార్వతి పోటీచేశారు. టీడీపీ తరుపున కలమట మోహన్ రావ్ భార్య వేణమ్మ ను పోటీకి దించారు. టీడీపీ తరుపున గ్రామానికొక మంత్రిని పెట్టారు. లక్ష్మి పార్వతి వర్గం తరువున ఇంద్రారెడ్డి ,బుచ్చయ్య చౌదరి తదితరులు బాధ్యతలు తీసుకున్నారు. లక్ష్మి పార్వతి తరుపున బండారు దత్తాత్రేయ ,ఇంద్రసేనా రెడ్డి,విద్యాసాగర్ రావ్ తదితరులు ప్రచారం చేశారు...నంద్యాల ఉప ఎన్నికను హేండిల్ చేసినట్లు అప్పట్లో పాతపట్నం ఉప ఎన్నికను డీల్ చేయలేకపోయారు... లక్ష్మి పార్వతి 14 వేల మెజారిటీతో గెలిచారు, చంద్రబాబు మీద లక్ష్మి పార్వతి తోలి గెలుపు అది.  బీజేపీ-టీడీపీ(లక్ష్మి పార్వతి) పొత్తు 

సంవత్సరం తిరిగే లోపు లోక్ సభకు 1998లో మధ్యాంతర ఎన్నికలు వొచ్చాయి. బీజేపీ,లక్ష్మి పార్వతి టీడీపితో  పొత్తుపెట్టుకుంది.హోరా హోరి పోరులో కాంగ్రెస్ 22,బీజేపీ 4,టీడీపీ మిత్రపక్షాలు 15(టీడీపీ 12+సిపిఐ-2+జనతాదళ్-1),ఎంఐఎం -1 స్థానాలు గెలిచాయి. లక్ష్మి పార్వతి టీడీపీ పోటీ చేసిన ఐదు స్థానాలలో ఒక్కసీటు గెలవలేదు కానీ శ్రీకాకుళంలో రెండవ స్థానంలో నిలిచింది,కాంగ్రెస్ తరుపున పోటీచేసిన ధర్మాన ప్రసాద్ రావ్ మూడు స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో బీజేపీ కి 18% ,లక్ష్మి పార్వతి వర్గానికి వారు పోటీచేసిన ఐదు స్థానాలలో 11.56% ఓట్లు వొచ్చాయి. బీజేపీ రాజమండ్రి,కాకినాడ లో గెలవటం చంద్రబాబుకు పెద్ద షాక్.ఆ ఎన్నికల్లో బీజేపీ-లక్ష్మి పార్వతి వర్గం 20% ఓట్లు సాధించింది. 

ఎడమ నుంచి కుడికి  

1998 ఎన్నికల్లో NDA కు ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మెజారిటీ రాకపోవటంతో చంద్రబాబు కమ్యునిస్టులతో స్నేహాన్ని తెంచుకొని  వాజపాయ్ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇచ్చి బాలయోగిని స్పీకర్ ను చేశారు. 13 నెలలకే వాజపాయ్ ప్రబుత్వం కూలిపోయింది. కార్గిల్ యుద్ధం ,13 రోజుల్లో ఒకసారి,13 ను నెలలో మరోసారి ప్రభుత్వం కూలిపోవడంతో బీజేపీ మీద ప్రజలలో నెలకొన్న సానుభూతి ఓట్ల రాలుస్తాయన్న అంచనాతో 1999లో  శాసనసభ,లోక్ సభకు జమిలీగా జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో పొత్తుపెట్టుకొని గెలిచారు. 

బీజేపీ చంద్రబాబుతో పొత్తుపెట్టుకొని ఉండకపోతే?

1999 ఎన్నికల్లో బీజేపీ చంద్రబాబుతో  కాకుండ  లక్ష్మి పార్వతితో పొత్తుపెట్టుకొని ఉంటే పరిస్థితి ఎలాఉండేదో చెప్పలేము,కానీ లక్ష్మి పార్వతి పార్టీ కనీసం ఒకటి రెండు ఎమ్మెల్యే స్థానాలు గెలిచేవారు. 1999లో పోలింగ్ ముగిసిన తరువాత టీడీపీ గెలుపు మీద చంద్రబాబుకే నమ్మకం లేదు. మరోవైపు వైస్సార్ ఇంటికి కొత్త రంగులు వేయించారు. దీపం పథకం ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు రెండవ ముఖ్యకారణం. 

1999లో లక్ష్మి పార్వతి సోంపేట,ఏలూరు రెండు స్థానాల నుంచి, 2004లో కర్నూల్ జిల్లా ఆత్మకూరు నుంచి ఓడిపోయారు.ఆ తరువాత ఎన్నికల్లో పోటీచేయలేదు. 

వైసీపీ ఏర్పడ్డప్పటి నుంచి లక్ష్మి  పార్వతి ఆపార్టీలో కొనసాగుతున్నారు. రాజకీయంగా చివరి మజిలీలో ఉన్న లక్ష్మి పార్వతికి "తెలుగు  అకాడమి" రూపంలో గుర్తింపు దక్కింది. అదృష్టం కలిసొస్తే మరింత పెద్దపదవి కూడా భవిషత్తులో దక్కవోచ్చు.అందుకే అన్నది యుద్ధం  ముగింపు కాదు అని.  వైశ్రాయ్ యుద్ధంలో గెలుపు తాత్కాలికమే,2004 & 2009లో ఓడిపోయినప్పుడు ,2014లో ఓటమి తప్పదన్న పరిస్థితుల్లో కూడా చంద్రబాబు చూపిన తెగువ,చాణుక్యం ఏమిలేదు. గమనిస్తే చంద్రబాబు గెలిచిన 1999-కార్గిల్ యుద్ధం,2014-రాష్ట్ర విభజన  రెండు కూడా  ప్రత్యేక సందర్భంలోనే జరిగాయి.2019లో పోటీచేసిన తోలి ఎన్నికలో కొడుకును గెలిపించుకోలేక,సొంత జిల్లాలో కేవలం తనుమాత్రమే గెలిచి 23 స్థానాలకే పరిమితమయిన చంద్రబాబు కుడి భుజం,ఎడం భుజం మొదలు పెద్ద నాయకులందరూ బీజేపీలోకి క్యూ కడుతుంటే నిచేష్టుడై చూస్తుండిపోయాడు. 

అహంభావం రాజకీయాల్లో చెల్లదు...ఇష్టం ఉన్నాలేకున్నా ప్రత్యర్థులకు కనీస గౌరవం ఇవ్వాలి.ఇది రాజకీయాల్లో ఉన్న అందరికి వర్తిస్తుంది. రాజకీయ చక్రం ఐదేళ్లకు ఏపార్టీ వద్ద ఆగుతుందో చెప్పలేము. 

Related News