ఏపీ ప్రెస్ అకాడ‌మీ చైర్మ‌న్‌గా దేవిరెడ్డి శ్రీ‌నాథ‌రెడ్డి

ఏపీ ప్రెస్ అకాడ‌మీ చైర్మ‌న్‌గా దేవిరెడ్డి శ్రీ‌నాథ‌రెడ్డి

08-11-2019 01:32 PM Sodum Ramana

ఏపీ ప్రెస్ అకాడ‌మీ చైర్మ‌న్‌గా క‌డ‌ప జిల్లాకు చెందిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు దేవిరెడ్డి శ్రీ‌నాథ‌రెడ్డిని నియ‌మిస్తూ ఏపీ స‌ర్కార్ శుక్ర‌వారం ఉత్త‌ర్వులిచ్చింది. ఈయ‌న క‌డ‌ప జిల్లా పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోని కోరుగుంట‌ప‌ల్లె నివాసి. 1978లో ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ బెంగ‌ళూరు ఎడిష‌న్‌లో స‌బ్ ఎడిట‌ర్‌గా జీవితాన్ని ఆరంభించారు. శ్రీ‌నాథ్ క‌లం ప‌దునైన‌ది.

బెంగ‌ళూరు నుంచి ఆయ‌న క‌డ‌ప‌కు మ‌కాం మార్చారు. 1982లో ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌భ‌- ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ క‌డ‌ప క‌ర‌స్పాండెంట్‌గా కొత్త అవ‌తారం ఎత్తారు. ఆవు-దూడ శీర్షిక కింద ప్ర‌తి ఆదివారం ఆయ‌న రాసే క‌థ‌నాలు పాఠ‌క లోకాన్ని విశేషంగా ఆక‌ట్టుకునేవి. కొంత‌కాలం సాక్షి దిన‌పత్రిక‌లో కూడా హైద‌రాబాద్ కేంద్రంగా శ్రీ‌నాథ్‌రెడ్డి ప‌నిచేశారు.

రాజ‌కీయ‌, సామాజిక అంశాల‌పై సునిశిత విమ‌ర్శ‌తో కూడిన ఆయ‌న క‌థ‌నాలు రాజ‌కీయ నేత‌ల‌ను గిచ్చిన‌ట్ట‌నిపించేది. రాయ‌ల‌సీమ స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న విస్తృతంగా క‌థ‌నాలు రాశారు. రాయ‌ల‌సీమ ఉద్య‌మంలో జ‌ర్న‌లిస్టుగా ప్ర‌ముఖ ఉద్య‌మ‌కారుడు ఎంవీ మైసూరారెడ్డితో క‌ల‌సి అనేక పోరాటాలు చేశారు. అలాగే ప్ర‌స్తుత క‌మ‌లాపురం ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ‌రెడ్డితో క‌ల‌సి రాయ‌ల‌సీమ విమోచ‌న స‌మితి ఏర్పాటు చేసి ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేసే క్ర‌మంలో అనేక క‌థ‌నాలు రాశారు. అలాగే రాజ‌కీయ నేత‌ల‌తో క‌ల‌సి ప్ర‌త్య‌క్ష కార్యాచార‌ణ‌కు దిగారు.

శ్రీ‌నాథ‌రెడ్డిది రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న కుటుంబం. అనంత‌పురం జిల్లా దాడితోట‌కు చెందిన మాజీ మంత్రి నాగిరెడ్డి సోద‌రిని వివాహ‌మాడారు. అలాగే మాజీ మంత్రి దివాక‌ర్‌రెడ్డి చిన్నాన్న అవుతారు. క‌డ‌ప జిల్లాకు చెందిన టీడీపీ నేత‌లు కూడా ఎస్వీ స‌తీష్‌రెడ్డి, మాజీ మంత్రి రాజ‌గోపాల్‌రెడ్డిలు కూడా ద‌గ్గ‌రి బంధువులు.  

ఏపీయూడ‌బ్ల్యూజే క‌డ‌ప జిల్లా అధ్య‌క్షుడిగా శ్రీ‌నాథ్‌రెడ్డి సుదీర్ఘ‌కాలం పాటు ప‌నిచేశారు. జ‌ర్న‌లిస్టు కావ‌డ‌మే కాకుండా వారి స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న క‌లిగిన శ్రీ‌నాథ్‌రెడ్డి ఏపీ ప్రెస్ అకాడ‌మీ చైర్మ‌న్‌గా నియ‌మితుడు కావ‌డంపై ప‌లువురు జ‌ర్న‌లిస్టు నాయ‌కులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. 

Related News